Thursday, August 29, 2013

పరిష్కారం దిశగా అడుగులు వేయవలసిన సమయం ఆసన్నం అయింది.

తెలుగు జాతిని విడ గొట్టద్దంటారు. రెండు రాష్ట్రాలుగా విడిపోతే తెలుగు జాతి విడిపోతుందా? రెండు జిల్లాలకి రెండు రాష్ట్రాలకి తేడా ఏమిటి? గుంటూరు జిల్లా తెలుగు వారికి కృష్ణా జిల్లా తెలుగు వారికి అడ్డుగోడలు ఏమైనా ఉన్నాయా? అసలు ఈ భావోద్వేగాలు ఎందుకు? తెలంగాణా ప్రాంతీయుల్లో తమ యాసను, సంస్కృతిని ఆంధ్ర ప్రాంతీయులు దెబ్బ తీసారని నరనరాల్లో జీర్ణించుకు పోయింది. అందుకు కొంత ఆంధ్ర ప్రాంతీయులు కారణమయితే కొంత తెలంగాణా ప్రాంత రాజకీయ నాయకుల స్వార్ధపుటెత్తుగడలు కారణం. సరే. ఒకరు విదిపోదామంటారు. మరొకరు కలిసి ఉందామంటారు. రెండూ ఒకేసారి ఎలా సాధ్యం? ఈ కాష్టం గత 60 ఏళ్ళుగా రగులుతూనే ఉంది. దీన్ని చల్లార్చేందుకు అటు సీమాంధ్ర రాజకీయ నాయకత్వం కాని, సాంస్కృతిక నాయకత్వం కాని, భాషా కోవిదులు కాని, చరిత్ర కారులు కాని, మేధావులు కాని చేసిన ప్రయత్నాలు శూన్యం. కనీసం ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన గత పుష్కర కాలం లో నయినా జాగ్రత్త పడవలసింది. ఇప్పుడు సమయం మించి పోయింది. ఇంతటి విద్వేషాలు, కార్పణ్యాల మధ్య కలిసి ఉండడం కంటే విడిపోయి ఒకరితో ఒకరు సహృద్భావ వాతావరణంలో జీవించడం ఇరు ప్రాంతాల ప్రజలకు మంచిది. గత రెండూ దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలించిన వారు దూర దృష్టి లేక పోవడం వల్ల అభివృద్ది అంతా హైదరాబాద్ కేంద్రం గానే జరిగింది. తత్ఫలితంగా హైదరాబాద్ ఆదాయం లేనిదే ఏ ప్రాంతం మనుగడ సాగించలేని పరిస్థితి. ఇలా కాకుండా ప్రతీ జిల్లా లోని మండల కేంద్రాన్ని అభివృద్ధికి ఆలవాలం చేసుంటే రాష్ట్రంలో 1200 కు పైగా చిన్న పట్టణాలు అభివృద్ది చెంది బహుశా రాష్ట్రాన్ని విడగొట్టమనే ఉద్యమానికి ఇంతటి మద్దతు తెలంగాణ ప్రాంతంలో కాని, సమైక్యం గా ఉంచాలనే ఉద్యమానికి  ఇంతటి మద్దతు సీమాంధ్ర ప్రాంతం లో కాని వచ్చి ఉండేది కాదేమో.  ఇప్పుడిక మిగిలింది ప్రజల మధ్య ఇంకా అంతరాలు పెంచకుండా విడి పోయే అన్ని ప్రాంతాల మనుగడకు అవసరమయిన రీతిలో సామరస్య పూర్వకమయిన పరిష్కారాన్ని అందించడం ఈ నేలపై పుట్టిన ప్రతి రాజకీయ నాయకుడి కర్తవ్యం. అందుకు జాతీయ నాయకత్వానికి కుడా దిశా నిర్దేశం అవసరం.

Tuesday, August 27, 2013

కుల ప్రాతిపదికపై ఏర్పడే ఏ భావజాలం కూడా కులాన్ని నిర్మూలించ లేదు. ఈ మధ్య కొందరు బ్రాహ్మణ వ్యతిరేక వాదంతో బి.సి., యస్.సి., యస్.టి., మైనారిటీ, బ్రాహ్మణ-వైశ్యేతర యఫ్.సి. కులాల వారు ఈ దేశ మూల వాసులని వీరిని సంఘటిత పరిచి బ్రాహ్మణ వై శ్యులను, బ్రాహ్మణ వాదాన్ని అంటే వారి ఉద్దేశం లో హిందూ మతాన్ని ఈ దేశం నుండి పార ద్రోలాలని, విదేశీయులైన బ్రాహ్మణుల దాస్యాన్ని భారతీయులు విడనాడినప్పుడే భారతీయులకు నిజమైన విముక్తి అని ప్రచారం చేస్తూ తమకు తాము అంబేద్కర్ వాదులుగా ముసుగు వేసుకుని భారతీయ సమాజాన్ని విషపూరితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బ్రాహ్మణ్యం అంటే తెలియని బ్రాహ్మణులు కొందరు (వీరిని నేను బ్రాహ్మణులుగా భావించను) హిందూ మతానికి ఎయిడ్స్ వ్యాధిలా అంటించిన అంటరానితనానికి దీనికి ప్రతిగా ఇప్పుడు కొందరు చేస్తున్న బ్రాహ్మణ వైశ్య ద్వేష ప్రతి పాదనలకు పెద్దగా తేడా లేదని నా అభిప్రాయం.
ప్రజా సమస్యలన్నీ గాలికి పోయాయి. అప్పుడు ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం. వెరసి పరస్పర విద్వేషాలు, కార్పణ్యాలు. నేనెంతటి ఆశాజీవి నైనా అప్పుడప్పుడు నిరాశ, నిస్పృహలు అవహిస్తూ ఉంటాయి. ఆశిస్తున్న మార్పు కొంచెమే అయినా, ప్రజల్లో కొద్దిపాటి ఆలోచన కూడా ఆచరణాత్మకంగా కలగటం లేదేమిటా అని. నేనేమి అద్భుతాలు జరగాలని కోరుకోవటం లేదు. భావోద్వేగాల గుప్పిట్లో సామాన్యులు శలభాల్లా మారి తమ జీవితాల్ని నాశనం చేసుకుంటుంటే రాజకీయ నాయకులు తమ బొజ్జలు పెంచుకుంటూ, వికృత క్రీడలను మహదానందంగా ఆడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ వల్ల తెలంగాణలోని సామాన్యుడికి ఒరిగేదేమీ లేదని ఆనాడు చెప్పినా ఎవరూ వినే పరిస్థితి లేక పోయింది. ఈ వేళ రాష్ట్రం విడిపోయినా సీమాంధ్ర లోని సామాన్యుడికి పోయేదేమీ లేదని చెప్పినా వినిపించుకునే వాడు లేదు. కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజలకు మరింత మెరుగ్గా సేవలందించడం కోసం తీసుకోవలసిన నిర్ణయాలను రాజకీయ పార్టీలు, నాయకులు తమ స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకోవడం దారుణం. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి, పొట్టేళ్లలా ప్రజలు కుమ్ముకుంటుంటే కారే రక్తాన్ని వోట్ల రూపంలో ఎలా మార్చుకోవాలా అని రాజకీయ పార్టీలు ప్రణాళికలు వేసుకుంటుంటే దేశం అన్ని రంగాలలోను వైఫల్యాలను చవిచూస్తూ నానాటికి దిగజారి పోతుంటే ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి. ఈ దేశానికి సరైన నాయకత్వాన్ని అందించలేకపోవడం మా తరం దౌర్భాగ్యపు వైఫల్యం.