తెలుగు జాతిని విడ గొట్టద్దంటారు. రెండు రాష్ట్రాలుగా విడిపోతే తెలుగు జాతి విడిపోతుందా? రెండు జిల్లాలకి రెండు రాష్ట్రాలకి తేడా ఏమిటి? గుంటూరు జిల్లా తెలుగు వారికి కృష్ణా జిల్లా తెలుగు వారికి అడ్డుగోడలు ఏమైనా ఉన్నాయా? అసలు ఈ భావోద్వేగాలు ఎందుకు? తెలంగాణా ప్రాంతీయుల్లో తమ యాసను, సంస్కృతిని ఆంధ్ర ప్రాంతీయులు దెబ్బ తీసారని నరనరాల్లో జీర్ణించుకు పోయింది. అందుకు కొంత ఆంధ్ర ప్రాంతీయులు కారణమయితే కొంత తెలంగాణా ప్రాంత రాజకీయ నాయకుల స్వార్ధపుటెత్తుగడలు కారణం. సరే. ఒకరు విదిపోదామంటారు. మరొకరు కలిసి ఉందామంటారు. రెండూ ఒకేసారి ఎలా సాధ్యం? ఈ కాష్టం గత 60 ఏళ్ళుగా రగులుతూనే ఉంది. దీన్ని చల్లార్చేందుకు అటు సీమాంధ్ర రాజకీయ నాయకత్వం కాని, సాంస్కృతిక నాయకత్వం కాని, భాషా కోవిదులు కాని, చరిత్ర కారులు కాని, మేధావులు కాని చేసిన ప్రయత్నాలు శూన్యం. కనీసం ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన గత పుష్కర కాలం లో నయినా జాగ్రత్త పడవలసింది. ఇప్పుడు సమయం మించి పోయింది. ఇంతటి విద్వేషాలు, కార్పణ్యాల మధ్య కలిసి ఉండడం కంటే విడిపోయి ఒకరితో ఒకరు సహృద్భావ వాతావరణంలో జీవించడం ఇరు ప్రాంతాల ప్రజలకు మంచిది. గత రెండూ దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలించిన వారు దూర దృష్టి లేక పోవడం వల్ల అభివృద్ది అంతా హైదరాబాద్ కేంద్రం గానే జరిగింది. తత్ఫలితంగా హైదరాబాద్ ఆదాయం లేనిదే ఏ ప్రాంతం మనుగడ సాగించలేని పరిస్థితి. ఇలా కాకుండా ప్రతీ జిల్లా లోని మండల కేంద్రాన్ని అభివృద్ధికి ఆలవాలం చేసుంటే రాష్ట్రంలో 1200 కు పైగా చిన్న పట్టణాలు అభివృద్ది చెంది బహుశా రాష్ట్రాన్ని విడగొట్టమనే ఉద్యమానికి ఇంతటి మద్దతు తెలంగాణ ప్రాంతంలో కాని, సమైక్యం గా ఉంచాలనే ఉద్యమానికి ఇంతటి మద్దతు సీమాంధ్ర ప్రాంతం లో కాని వచ్చి ఉండేది కాదేమో. ఇప్పుడిక మిగిలింది ప్రజల మధ్య ఇంకా అంతరాలు పెంచకుండా విడి పోయే అన్ని ప్రాంతాల మనుగడకు అవసరమయిన రీతిలో సామరస్య పూర్వకమయిన పరిష్కారాన్ని అందించడం ఈ నేలపై పుట్టిన ప్రతి రాజకీయ నాయకుడి కర్తవ్యం. అందుకు జాతీయ నాయకత్వానికి కుడా దిశా నిర్దేశం అవసరం.
Thursday, August 29, 2013
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment